Bandi Sanjay: రోజక్క పెట్టిన చేపల పులుసు తిన్నాడు... చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay fires at KCR in Mahaboobnagar

  • తెలంగాణలో కమలం పువ్వు గుర్తు రాజ్యం రావాలన్న బండి సంజయ్
  • బీఆర్ఎస్ గుడిని మింగితే... కాంగ్రెస్ గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతుందని విమర్శలు
  • ఏ హామీ నెరవేర్చారని కేసీఆర్‌కు ఓటు వేయాలని బండి సంజయ్ ప్రశ్న

తాము ప్రజల కోసం కొట్లాడామని, మీకోసం కొట్లాడితే తమపై రాళ్ల దాడి చేశారని, పోలీసులతో కొట్టించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మహబూబ్ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ వారు ప్రజల కోసం కొట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారిపై బ్లాక్ మెయిల్ కేసులు ఉంటాయని, బీఆర్ఎస్ వారిపై భూకబ్జా కేసులు ఉంటాయని, కానీ బీజేపీ వారిపై ప్రజల కోసం కొట్లాడిన కేసులు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ గుడిని మింగితే, కాంగ్రెస్ గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ వారు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతారన్నారు. కేసీఆర్‌ను వణికించాలంటే కమలం పువ్వు రాజ్యం రావాలన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను గెలిపిస్తే ఇక్కడ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని, కానీ ప్రధాని మోదీ మాత్రం పేదవారికి ఇళ్లు ఇవ్వాలని రెండు లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చారన్నారు. శ్రీనివాస్ గౌడ్... సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి మా పేదవారికి ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదేమిటి? ఇస్తావా? ఇవ్వవా? అని గల్లా పట్టి అడగాలి కదా? అన్నారు. కానీ ఆయన మాత్రం భూములు కబ్జా చేసి, పర్సెంటేజీ తీసుకుంటాడని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు భారీగా డబ్బులు సంపాదించుకున్నారని, ఎన్నికలు రాగానే వాటిని ఖర్చు చేస్తున్నారన్నారు. వారు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఎందుకంటే ఆ డబ్బులు మనవే అన్నారు. బియ్యానికి, రోడ్లకు, వ్యాక్సీన్‌కు... ఇలా ప్రతి పైసా మోదీనే ఇచ్చారన్నారు. కానీ ఆ పథకాలకు మాత్రం మోదీ పేరు పెట్టడం లేదన్నారు. 

వివిధ పథకాలకు కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చారు? మోదీ ఎన్ని డబ్బులు ఇచ్చారు? అని లెక్కలు అడగాలన్నారు. చివరకు బాత్రూం డబ్బులు కూడా మోదీయే ఇచ్చారన్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే నిలదీయాలన్నారు. లేదంటే అయిదేళ్ల వరకు వారు కనిపించరన్నారు. కేసీఆర్ ఏడాదిలో ప్రగతి భవన్ పేరుతో వంద రూములతో ఇల్లు కట్టుకున్నాడన్నారు. కేసీఆర్ ఇంట్లోనే ఇప్పుడు ఐదు ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఆ ఇంటికి నెలకు రూ.10 లక్షలకు పైగా వేతనాలు ఉన్నాయన్నారు. కానీ పేదవారికి ఏమీ చేయలేదన్నారు. పాలమూరులో ఇప్పటికీ వలసకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు.

పక్క రాష్ట్రం వారు మన కృష్ణా నీరు తీసుకువెళ్తే కేసీఆర్ మాత్రం కమీషన్ తీసుకొని ఫామ్ హౌస్‌లో పడుకున్నారన్నారు. అక్కడకు (ఏపీకి) వెళ్లి మా రోజక్క పెట్టిన చేపల పులుసు తిన్నాడని, రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాటలు చెప్పాడని, కానీ ఇక్కడకు వచ్చి పాలమూరును ఎడారి చేశాడన్నారు. కేసీఆర్ ఇక్కడకు నీళ్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన పైసలు తీసుకొని దొంగ సంతకాలు పెట్టింది కేసీఆరే అని, దాని గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు. ఇన్నాళ్లు కనీసం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డు ఇవ్వలేదు.. పెన్షన్ ఇవ్వలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. డబుల్ బెడ్రూం ఇవ్వలేదని.. అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలన్నారు. పాలమూరు ప్రజలు పైసలకు ఓటు వేయరని తనకు తెలుసునని సంజయ్ అన్నారు. 

  • Loading...

More Telugu News