Ma Oori Polimera 2: ఆ సంఘటనలో నుంచి 'మా ఊరి పొలిమేర 2' కథ పుట్టింది: డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్

Anil Vishvanath Interview

  • ఓటీటీ ద్వారా విడుదలైన 'మా ఊరి పొలిమేర'
  • థియేటర్స్ లో హిట్ కొట్టిన సీక్వెల్ 
  • తన కథకు ఆ సంఘటన ప్రేరణ అని చెప్పిన డైరెక్టర్ 
  • చేతబడి అనేది ఒక మూఢ నమ్మకమని వెల్లడి


'సత్యం' రాజేశ్ ప్రధాన పాత్రగా 2021లో 'మా ఊరి పొలిమేర' సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో 'చేతబడి' చుట్టూ తిరిగే కథ ఇది. ఆ సినిమాకి సీక్వెల్ చేసి దానిని 'మా ఊరి పొలిమేర 2'గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే హిట్ కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. 

"గతంలో బ్లాక్ మేజిక్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేయలేదు. 'ఒకే చితిలో రెండు శవాలు' అనే హెడ్డింగ్ తో చాలా కాలం క్రితం వచ్చిన ఒక క్రైమ్ న్యూస్ చూశాను. మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఒక ఆటో డ్రైవర్ చేతబడి చేసి ఆ అమ్మాయిని చంపాడనే అనుమానంతో ఊళ్లో వాళ్లంతా కలిసి అతణ్ణి చంపేసి అదే చితిలో వేశారు" అని అన్నాడు. 

"ఆ వ్యక్తిని గుంపుగా కలిసి చంపడం వలన పోలీస్ కేసు కాకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చేతబడి అనేది ఉందా? లేదా? అనే విషయం పక్కన పడితే, చేతబడి చేశాడనే అనుమానంతో చంపడం ఏమిటి? అనేది నన్ను ఆలోచింపజేసింది.  ఆ సంఘటన నుంచి నేను ఈ కథను తయారు చేసుకున్నాను. నేను మాత్రం చేతబడి అనేది ఒక మూఢనమ్మకంగానే భావిస్తాను" అని చెప్పాడు. 

More Telugu News