Sabitha Indra Reddy: నియోజకవర్గమే నా ఇళ్లు... ప్రజలే నా కుటుంబ సభ్యులు: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy campaign in maheswaram

  • రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న మంత్రి
  • మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని వెల్లడి
  • ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా అయిదేళ్లు జనంలో ఉండే తనను గెలిపించాలన్న సబిత

రైతు బంధు, రైతు బీమా, కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ఇస్తున్న సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. మహేశ్వరంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని, హైదరాబాద్‎లో ప్రజలు ఏ నీరు తాగుతున్నారో.. అదే నీరు మనమంతా తాగుతున్నామంటే ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గమే తన ఇల్లు అని, ప్రజలే తన కుటుంబసభ్యులన్నారు. ప్రజాసేవకే తన జీవితం అంకితమన్నారు.

కరోన వచ్చినా, వర్షాలు వచ్చి వరదలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. ఇంతవరకు కనిపించని వాళ్లు నేడు ఓట్ల కోసం వస్తున్నారన్నారు. ఒక్కసారి ఆలోచించి, పనిచేసే వారిని గుర్తించాలని కోరారు. రూ.6600 కోట్లతో మహేశ్వరం వరకు మెట్రో రైలు తీసుకొచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. కందుకూరు శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మీర్‌ఖాన్‌పేటలో మెడికల్ కాలేజీ, 450 పడకల దవాఖాన వస్తుండటంతో మన ముంగిట్లోకి వైద్య సేవలు రానున్నాయన్నారు.

నియోజకవర్గంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేసుకుని విద్యాభివృద్ధికి బాటలు వేసుకున్నామన్నారు. ఒక ఆడబిడ్డగా పోటీ చేస్తున్నానని... తనకు మద్దతివ్వాలని కోరారు. ఇష్టంలేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా అయిదేళ్ళు జనం మధ్యలో ఉండే తనను గెలిపించాలని కోరారు. ప్రజల్లో చిచ్చుపెట్టి, అభివృద్ధి పట్టని పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. చేవెళ్లలో చెల్లని రూపాయి, మేడ్చల్‎లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా? అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు.

  • Loading...

More Telugu News