Jeevan Reddy: విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- ఒక ఎకరాకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని మాత్రమే అన్నారని వివరణ
- కాంగ్రెస్ 70కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా
- జగిత్యాల జిల్లాలో యథేచ్చగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందని విమర్శ
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, అలా వ్యవహరించిన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకానికి అనుమతులు మంజూరు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులను తక్షణమే తొలగించాలన్నారు. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు.
ఈసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చూస్తుంటే, జగిత్యాల జిల్లాలో మాత్రం యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు. జిల్లాలో అసలు యంత్రాంగం ఉందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
విద్యుత్ అంశంలో తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక ఎకరాకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని మాత్రమే అన్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు కోత పెట్టి మరీ రైతులకు సాగునీటి కోసం తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామన్నారు.