Benjamin Netanyahu: మేం సాయం చేస్తామన్నా వారు వద్దంటున్నారు.. ఇజ్రాయెల్ ప్రధాని ఎదురుదాడి
- ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ఉక్కిరిబిక్కిరి
- గాజాలోని అల్ షిఫా ఆసుపత్రికి నిలిచిపోయిన ఇంధన సరఫరా
- ఆదివారం ఎన్‌బీసీ ఛానల్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటర్వ్యూ
- ఆసుపత్రికి ఇంధనం ఇస్తామన్నా వారు వద్దన్నారని నెతన్యాహూ వెల్లడి
గాజాలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయకులు సమిధలైపోతున్నారు. దీంతో, ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. కానీ, నష్టనివారణ చర్యల్లోనూ ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ ఎదురుదాడినే ఎంచుకుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదివారం ఎన్‌బీసీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము మానవతాదృక్పథంతో సాయం చేస్తామన్నా హమాస్ తిరస్కరించిందని చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇంధన సరఫరాకు అడ్డంకి ఏర్పడి గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో కార్యకలాపాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆసుపత్రి కింద భూగర్భంలో హమాస్ కేంద్రం ఉందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ తన దాడులు కొనసాగిస్తోంది. హమాస్‌పై దాడుల పేరుతో ఇలా ఆసుపత్రిలో రోగులు, చిన్నారులను ప్రాణాపాయంలోకి నెట్టడం న్యాయమా? అని యాంకర్ నెతన్యాహూను ప్రశ్నించారు. అయితే, తాము ఇంధనం అందించేందుకు ముందుకొచ్చినా వారు నిరాకరించారని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘గత రాత్రే వారి అవసరాలకు సరిపడా ఇంధనం ఇస్తామన్నాం. మాకు రోగులు, సామాన్య పౌరులతో ఎటువంటి ఘర్షణ లేదు. కానీ వారు మాత్రం మా సాయాన్ని తిరస్కరించారు’’ అని తెలిపారు.