46k Mobile: రూ.46 వేల ఫోన్ ఆర్డర్ పెడితే 3 సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. థానే యువకుడికి చేదు అనుభవం
- ప్యాకేజ్ మధ్యలో ఎవరో మార్చేశారంటున్న కంపెనీ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
- విచారణ జరుపుతున్నట్లు వెల్లడించిన పోలీసులు
ఖరీదైన మొబైల్ ఫోన్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన యువకుడు వచ్చిన పార్సిల్ విప్పి చూసి కంగుతిన్నాడు. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా మూడు సబ్బులు ఉండడంతో పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టాడు. మహారాష్ట్రలో శనివారం చోటుచేసుకున్న ఈ మోసం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే కు చెందిన పాతికేళ్ల యువకుడు ఒకరు రూ.46 వేల విలువైన స్మార్ట్ ఫోన్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. ముందే డబ్బులు చెల్లించి పార్సిల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
శనివారం కంపెనీ నుంచి వచ్చిన ఆర్డర్ తీసుకుని విప్పి చూడగా అందులో ఫోన్ కు బదులు 3 సబ్బులు కనిపించాయి. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా.. ప్యాకింగ్ కరెక్ట్ గానే జరిగిందని, ట్రాన్స్ పోర్ట్ లోనే ఎవరో ఫోన్ దొంగిలించారని చెప్పారు.