KTR: కొత్త కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ ప్లాన్: కేటీఆర్

KTR alleges Congress and BJP are looming new plans

  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
  • మరింత ముదిరిన విమర్శల దాడులు
  • కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలు జరుగుతున్నాయన్న కేటీఆర్
  • వచ్చే 15 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు

తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన పార్టీల నేతలు పరస్పరం వాగ్బాణాలు సంధించుకుంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. కొత్త కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. 

జాతీయస్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఒకాయన కాళేశ్వరం మునిగిపోయిందని అంటాడని, మరొకాయన బ్యారేజి కొట్టుకుపోయిందని అంటాడని... ఢిల్లీలోని బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల్లో ఇలాంటివే కొత్త కొత్త వంటకాలు చేసి ప్రజల మీదకు వదులుతారని కేటీఆర్ అన్నారు. 15 రోజులు ఇవే కుట్రలు చేస్తూ మన ఆలోచన మారేలా చేస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఇక, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. డబ్బు ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనాలను కొనాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ధన మదాన్ని ఈ ఎన్నికల్లో అణచివేయాలని పిలుపునిచ్చారు. 

అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాళ్ల దాడిలో గాయాలు కావడంపైనా కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News