Bonda Uma: టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తీసుకున్న 10 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి జగన్ రెడ్డి?: బొండా ఉమ

Bonda Uma fires on Jagan

  • టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకే తెలియకుండా బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.10  వేలకోట్ల రుణం తెచ్చాడన్న బొండా ఉమ 
  • జగనన్న కాలనీల నిర్మాణం ముసుగులో జరిగిన భారీ అవినీతిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్
  • బ్యాంకులు ఎన్పీఏల్లో పెట్టిన లబ్ధిదారులందరినీ రాష్ట్ర ప్రభుత్వమే రెగ్యులర్ స్టేటస్ లో పెట్టేలా చూడాలని వ్యాఖ్య

2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు శాశ్వతంగా ఒక ఆస్తిని ఇవ్వాలనే సదుద్దేశంతో వారి సొంతింటి కలను చంద్రబాబునాయుడు నిజం చేస్తే... జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వారి కలల్ని కలలుగానే ఉంచాడని, టీడీపీ హయాంలో షీర్ వాల్ టెక్నాలజీతో పేదలకోసం నిర్మించిన 3.13లక్షల ఇళ్లను, జగన్ రెడ్డి బ్యాంకుల్లో తనఖాపెట్టి అప్పులు తీసుకోవడం, అతని సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. పేదలకే తెలియకుండా 10 వేల కోట్ల రుణం తెచ్చిన జగన్ రెడ్డి నిర్వాకంతో బ్యాంకులు లబ్ధిదారులపై పడ్డాయని, చాలా చోట్ల లబ్ధిదారుల్ని ఎన్.పీ.ఏ జాబితాలో చేర్చాయని అన్నారు. 

చంద్రబాబు పేదలకోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను వారికి కేటాయించకుండా.. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతున్నట్టు నాటకాలాడిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు కొట్టేసిందని విమర్శించారు. చాలీచాలని ఇంటి జాగాలు.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇచ్చి.. వారిన ఉద్ధరించినట్టు జగన్ అతని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం గతంలో పేదలకోసం కట్టించిన ఇళ్లను వారికి ఇవ్వని జగన్ రెడ్డి.. ఆ ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి... లబ్ధిదారులకే తెలియకుండా రూ.10 వేల కోట్ల రుణం తీసుకొచ్చాడని అన్నారు.

రుణం పొందడం కోసం లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తున్నామని.. వాటికి సంబంధించిన కొద్దీగొప్పో పనులు పూర్తి చేయాల్సి ఉందని బ్యాంకులకు చెప్పి జగన్ ప్రభుత్వం రుణాలు పొందిందని చెప్పారు. అలా తీసుకున్న రుణాలకు ఈ ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితి అడిగిందని... రెండేళ్లు అయినా బ్యాంకుల్లో అప్పు తీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పూర్తిచేయలేదని చెప్పారు. దాంతో బ్యాంకులు నేరుగా లబ్ధిదారులకే నోటీసులు పంపాయని... అంతటితో ఆగకుండా చివరకు ఇళ్ల లబ్ధిదారులకు మరే బ్యాంకులో రుణం పుట్టకుండా వారిని ఎన్పీఏ (నాన్ పెర్ఫ్మారెన్స్ అకౌంట్స్) జాబితాలో చేర్చాయని తెలిపారు. 

బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడం, ఇళ్లు వేలం వేస్తామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఎన్పీఏలుగా చేర్చిన పేదల్ని తిరిగి రెగ్యులర్ స్టేటస్ లో పెట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న కాలనీల నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని, టీడీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు కేటాయించాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News