Air Pollution: గాలి కాలుష్యంతో కార్డియాక్ అరెస్ట్.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఏడు విషయాలివే!

Air pollution cause cardiac arrest says experts

  • దీర్ఘకాలం వాయుకాలుష్యంతో హృద్రోగ సమస్యలు
  • గుండెకు ప్రధాన శత్రువు వాయు కాలుష్యమే
  • రక్తం గడ్డకట్టే ప్రమాదం
  • ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి మరింత ముప్పు 
  • కొన్ని అలవాట్లతో గుండెకు నిబ్బరం

ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదస్థాయికి మించి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, దీపావళి నాడు పెరిగే కాలుష్యానికి అంతూపొంతూ ఉండదు. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరిగే ఈ పండుగనాడు కాల్చే బాణసంచా విపరీతమైన కాలుష్యానికి కారణమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.  వాయు కాలుష్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఇది గుండెకు కూడా చేటుచేస్తుందన్న విషయం మీకు తెలుసా? వాయు కాలుష్యం హృద్రోగ సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

‘నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్’ ప్రకారం.. దీర్ఘకాలంపాటు వాయుకాలుష్యం వల్ల హార్ట్ ఎటాక్‌తోపాటు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాయు కాలుష్యం వల్ల తొలుత దెబ్బతినే అవయవం గుండె. కలుషిత గాలిని పీల్చడం వల్ల అందులోని కణాలు రక్తంలో చేరి అవి గుండెకు చేరుకుంటాయి. దీర్ఘకాలంపాటు ఇది ఇలాగే కొనసాగితే గుండె పోటు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. 

తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు ఇవే
* కాలుష్యం గుండెకు ప్రధాన శత్రువు
* కాలుష్యం రక్త నాళాలను కుచిస్తుంది. ఫలితంగా శరీరానికి రక్త సరఫరా సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది.
* వాయు కాలుష్యం అధికంగా ఉంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది.
* దీని వల్ల శరీరంలోని ఇతర భాగాలకు రక్తం అందించేందుకు రక్తాన్ని వేగంగా పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది.
* ఈ కారణంగా గుండె కండరాల్లో ఒత్తిడి పెరిగి వ్యాకోచిస్తాయి.
* ఫలితంగా హార్ట్‌బీట్‌ను నియంత్రించే ఎలక్ట్రికల్ సిస్టం దెబ్బతింటుంది.
* దీనివల్ల హార్ట్ రేట్ గతి తప్పుతుంది. 
వీటన్నింటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారిలో హార్ట్ ఎటాక్ ముప్పు మరింత పెరుగుతుంది. 

బయటపడడం ఎలా?
వాయు కాలుష్యం నుంచి తప్పించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల రోగాలతో ఫైట్ చేసేందుకు శరీరానికి అవసరమైన రోగ నిరోధకశక్తి అందుతుంది. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంతోపాటు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవడంతోపాటు నీటిని పుష్కలంగా తీసుకోవాలి.

వీటితోపాటు పాటు వ్యాయామం తప్పనిసరి. అది కూడా స్వచ్ఛమైన గాలి లభించే చోట వ్యాయామం చేస్తే మరింత మంచిది. బయట కాలుష్యం ఎక్కువగా ఉందనిపిస్తే ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యానికి చేటు చేసే అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యం అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

More Telugu News