Nampally Police: మా ప్రచార ‘కారు’ను తీసుకెళ్లడం అప్రజాస్వామికం: కాంగ్రెస్

Nampally Police Seize KCRs Pic On Number Plates From Congress Office

  • కారుమీద కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు
  • గాంధీ భవన్ నుంచి తీసుకెళ్లిన నాంపల్లి పోలీసులు
  • అధికార దుర్వినియోగమేనని మండిపడుతున్న కాంగ్రెస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత స్లోగన్లు రాసి ప్రచారం కోసం గాంధీభవన్ లో పెట్టిన కారును పోలీసులు తీసుకెళ్లారు. ఈ నెల 5న జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కారుకు గులాబీ రంగు వేసి, నెంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట కేసీఆర్ 420 అని రాయడంతో పాటు, కారు బాడీపైనా పలు స్లోగన్లు రాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సదరు కారుపైనా స్లోగన్ల రూపంలో పేర్కొంది. ఓఆర్ఆర్ స్కాం, కోల్ స్కాం, ధరణి పోర్టల్ స్కాం, కాళేశ్వరం స్కామ్, పేపర్ లీకేజీ స్కాండల్, ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ రాయించింది.

కారు పైన కేసీఆర్ ఫొటోతో పాటు తెలంగాణను ముంచిండు, 5 లక్షల కోట్ల అప్పు మోపిండంటూ స్లోగన్ కనిపిస్తోంది. కారు ముందు వైపు ‘పదేండ్ల అహంకారంపై తిరగబడదాం.. పదేండ్ల పంక్చర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం’.. కేసీఆర్ 420 అంటూ సీఎంను కించపరిచేలా నినాదాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ కారును గాంధీభవన్ లో ప్రదర్శనకు పెట్టారు. నాంపల్లి పోలీసులు స్పందించి ఈ నెల 5న కారును స్వాధీనం చేసుకున్నారు. 

మరోపక్క, పోలీసులు కారును తీసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ కార్యాలయం నుంచి తమ ప్రచార కారు ‘కేసీఆర్ 420’ను పోలీసులు తీసుకెళ్లారని పేర్కొంది. కల్వకుంట్ల కుటుంబం అహంకారాన్ని దెబ్బతీసిందని చెబుతూ.. పోలీసులు తమ అధికార దుర్వినియోగం చేశారని విమర్శించింది. పోలీసుల తీరు అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఫైరయ్యింది.

More Telugu News