Prasidh Krishna: పాండ్యా స్థానంలోకి ప్రసిద్ధ్ ఎందుకొచ్చాడో చెప్పిన రాహుల్ ద్రవిడ్
- జట్టులో తగినంతమంది స్పిన్నర్లు ఉన్నారన్న కోచ్
- ఫాస్ట్ బౌలింగ్ వనరులను పెంచుకునేందుకే ప్రసిద్ధ్‌కు ఓటేశామన్నద్రవిడ్
- నేడు సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సెలక్షన్‌కు అందుబాటులో మీడియం పేసర్
- బుమ్రా, సిరాజ్, షమీతో పోటీ
చీలమండ గాయం నుంచి కోలుకోపోవడంతో ప్రపంచకప్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. నేడు భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడానికి గల కారణాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. జట్టులో తగినంతమంది స్పిన్నర్లు ఉన్నారని, ఫాస్ట్ బౌలింగ్ వనరులను మరింత పెంచే ఉద్దేశంతోనే ప్రసిద్ధ్‌ను తీసుకున్నట్టు వెల్లడించాడు.
తాము ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడామని పేర్కొన్న ద్రవిడ్.. తమకు బ్యాకప్‌లో స్పిన్నర్లు, బ్యాటర్లు ఉన్నారని చెప్పాడు. బౌలింగ్ ఆల్‌రౌండ్ విభాగంలోనూ బ్యాకప్ ఉందని చెప్పుకొచ్చాడు. అనారోగ్యం లేదంటే మరేదైనా సమస్య ఉన్నప్పుడు అందుకోసం బ్యాకప్ కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించామని పేర్కొన్నాడు. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు తమకు అనుమతిస్తుందని వివరించాడు.
28 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ భారత్ తరపున ఇప్పటి వరకు 17 వన్డేలు ఆడి 29 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది భారత్‌లో విండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఓ వన్డేలో 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు అదే అతడి బెస్ట్. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ప్రసిద్ధ్ చివరిసారి కనిపించాడు. సౌతాఫ్రికాతో నేటి మ్యాచ్‌కు ముందు ప్రసిద్ధ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. అయితే, అతడికి బుమ్రా, షమీ, సిరాజ్‌తో పోటీఉంది.