KTR: రజినీకాంతే కాదు... బీజేపీ ఎంపీ కూడా హైదరాబాద్‌ను మెచ్చుకున్నారు: కేటీఆర్

KTR names rajinikanth sunny deol laya and Gangavva who praise hyderabad

  • కేసీఆర్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిందన్న కేటీఆర్
  • హైదరాబాద్ బాగుంది.. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ అన్నారన్న మంత్రి
  • కానీ విపక్షాలకు మాత్రం హైదరాబాద్ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శ

సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యనగరం న్యూయార్క్‌లా కనిపిస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్, సన్నీ డియోల్, లయ వంటి స్టార్లు అంటుంటే ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మాత్రం అర్థం కావడం లేదన్నారు. చివరకు గంగవ్వ కూడా దుబాయ్ కంటే హైదరాబాద్ బాగుందని చెబుతున్నారన్నారు. 

హిమాయత్ నగర్ కార్పోరేటర్ మహాలక్ష్మి తదితరులు నేడు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో బాగుంది, ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఉందని స్వయంగా బీజేపీ ఎంపీ సన్నీడియోల్ అన్నారన్నారు. కానీ హైదరాబాద్ అభివృద్ధి విపక్షాలకు కనిపించడం లేదన్నారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు.

పుట్టుక నుంచి చావుదాకా చూసుకునేలా కేసీఆర్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. సంపదను పెంచాలి.. దానిని పేదలకు పంచాలి అనేది కేసీఆర్ సిద్ధాంతమన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లకు ముందు హైద‌రాబాద్‌పై చాలామందికి అనుమానాలు ఉండేవని, ఇప్పుడు విశ్వనగరంగా ఎదిగిందన్నారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. రెండు వారాలకు ఒక‌సారి నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి నుంచి, ట్యాంక‌ర్లు బుక్ చేసుకునే ప‌రిస్థితి నుంచి ఇవాళ రోజు త‌ప్పించి రోజు నీళ్లు వస్తున్నాయన్నారు.

పదేళ్లలో క‌ర్ఫ్యూ లేదని, పటిష్టమైన శాంతిభద్రతలు ఉన్నాయని చెప్పారు. హైద‌రాబాద్‌ను ప్ర‌పంచంలోనే ఒక మంచి న‌గ‌రంగా తీర్చిదిద్దుకునేందుకు ఎన్నో కొత్త వ‌స‌తులు, కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నామన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన రోడ్లపై పోతుంటే కొత్త నగరంలో వెళుతున్నట్లుగా ఉంటుందన్నారు. హైద‌రాబాద్‌లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ వంటి క‌ట్ట‌డాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అమెరికాలోని న్యూయార్కు నగరంలా హైద‌రాబాద్ తయారైందన్నారు. అప్పుడే పుట్టిన ప‌సిగుడ్డును చూసుకున్న‌ట్టే తెలంగాణ‌ను కేసీఆర్ చూసుకుంటున్నార‌న్నారు.

  • Loading...

More Telugu News