Telugudesam: సీఎం జగన్ ఇసుక దోపిడీని బయట పెట్టినందుకే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు: టీడీపీ నేత పట్టాభిరామ్

False cases against TDP leaders because CM Jagan exposed sand exploitation says TDP leader Pattabhiram

  • ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వడమే చంద్రబాబు నేరమా అని ఆగ్రహం
  • చంద్రబాబును శిక్షించాలని కేసు పెట్టడం దుర్మార్గమని వ్యాఖ్య
  • సీఐడీ నమోదు చేసిన కేసులో స్పందించిన పట్టాభిరామ్

ఇసుకాసురుడు జగన్‌రెడ్డి మాదిరిగా చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడలేదని, జనాలపై కోట్ల రూపాయల భారం మోపలేదని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సీఐడీ కేసు నమోదు చేయడంపై పట్టాభి స్పందించారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇసుక దోపిడీని బయట పెట్టిన కారణంగానే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, చంద్రబాబును శిక్షించాలని కేసు పెట్టడం దుర్మార్గమని పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు.

జగన్‌రెడ్డి పాల్పడిన రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తి వెంకటరెడ్డి అని, ఆ వ్యక్తే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పట్టాభిరామ్ విమర్శించారు. వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచడంతోనే సీనరేజ్‌ ఫీజు రూపంలో రాష్ట్రానికి ఆదాయం నష్టం జరిగిందని పేర్కొన్నారు. టెండర్‌ విధానాన్ని కొనసాగించి ఉంటే కోట్ల రూపాయల రాబడి వచ్చేదని అన్నారు. ఇసుకను ఉచితంగా ఎలా ఇస్తారని పేర్కొనడం తప్ప సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అవినీతి ఆరోపణలను నిరూపించే ఒక్క అంశం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసుల్లో సీఎం జగన్ ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టుల్లోగానీ, ప్రజల ముందుగానీ ఉంచలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News