Etela Rajender: తెలంగాణ రాజకీయాలు... చంద్రబాబుపై ఈటల రాజేందర్ తీవ్రవ్యాఖ్యలు
- తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం
- 2018 తర్వాత విలీనం చేయడంతోనే కాంగ్రెస్ పని అయిపోయిందన్న ఈటల రాజేందర్
- బీజేపీ వస్తేనే అభివృద్ధి సాధ్యమన్న ఈటల రాజేందర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెరముందు ప్రచారం చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు 2023లో అదే పార్టీ గెలుపుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. తెలంగాణను పరిపాలించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ గత చరిత్ర కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్‌ను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.