Reliance Jio: చార్జీల విషయంలో జియో యూజర్లకు పెద్ద ఊరట

Reliance Jio prepaid plans to cost more Heres what the company has to say

  • చార్జీలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని స్పష్టీకరణ
  • భారతీయులు అందరికీ డేటా అందుబాటులో ఉండాలన్న అభిప్రాయం
  • మరింత మంది యూజర్లను సొంతం చేసుకోవడంపై దృష్టి

5జీ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. 4జీ నెట్ వర్క్ తో పోలిస్తే నెట్ వేగం 5జీలో 25 రెట్లు ఎక్కువ. కానీ, మన దేశంలో 4జీతో పోలిస్తే 5జీ వేగం రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ముందు ముందు 5జీ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఆ తర్వాత 6జీ ప్రవేశానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. అయితే, 5జీ నెట్ వర్క్ విస్తరణ కోసం అగ్రగామి టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఈ రెండూ సుమారు రూ. 3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. ఆ మొత్తాన్ని యూజర్ల నుంచి రాబట్టుకోకుండా ఎలా ఉంటాయి..? అందుకే భవిష్యత్తులో టెలికం చార్జీలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ టెల్ తోపాటు, వొడాఫోన్ ఐడియా చార్జీల పెంపు దిశగా ఇప్పటికే యోచిస్తున్నాయి. 

కానీ, దేశంలో చందాదారుల సంఖ్యా పరంగా మొదటి స్థానంలో ఉన్న జియో మాత్రం 5జీ చార్జీల పెంపు పట్ల సముఖంగా లేదని తెలుస్తోంది. పోటీనిచ్చే ధరలు ఉండాలన్నది జియో ఉద్దేశ్యం. అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని కంపెనీ భావిస్తోంది. మరింత మంది కస్టమర్లను సొంతం చేసుకోవడంపై తమ దృష్టి ఉంటుందని జియో ప్రెసిడెంట్ మ్యాథ్యూ ఊమెన్ స్పష్టం చేశారు. 

‘‘20 కోట్ల మందికి పైగా మొబైల్ కస్టమర్లు ఇప్పటికీ 2జీతోనే ఉన్నారు. వారికి డిజిటల్ సాధికారత కల్పించాలి. 2జీ ముక్త పరిశ్రమ కోసం చార్జీలు అందుబాటు ధరల్లో ఉండాల్సిందే’’ అని ఊమెన్ తెలిపారు. భారతీయులు అందరికీ డేటా యాక్సెస్ ఉండాలని, డేటాని వారికి దూరం చేయబోమని స్పష్టం చేశారు. జియో సగటు యూజర్ నుంచి పొందుతున్న ఆదాయం రూ.181.70గా ఉంది. ఎయిర్ టెల్ కు రూ.200 చొప్పున వస్తుండగా, వొడాఫోన్ ఐడియా రూ.142 చొప్పున ఒక్కో యూజర్ నుంచి పొందుతోంది. దీన్ని రూ.300కు తీసుకెళితేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని ఎయిర్ టెల్ అంటోంది.

More Telugu News