Arvind Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

Arvind Kejriwal Summoned By Enforcement directorate
  • నవంబర్ 2న విచారణకు రావాలంటూ పిలుపు
  • సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే పరిణామం
  • గతేడాది ఇదే అంశంపై సీబీఐ సమన్లు 
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ అవ్వడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాది దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.   

కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Arvind Kejriwal
AAP
Enforcement Directorate

More Telugu News