Gujarat: ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం కరోనా వల్లే: కేంద్ర ఆరోగ్య మంత్రి
- గుజరాత్ లో గార్భా నృత్య మరణాలపై స్పందించిన కేంద్ర మంత్రి మాండవీయ
- కరోనా వచ్చిన తర్వాత రెండేళ్ల వరకు అధిక శ్రమకు దూరంగా ఉండాలన్న సూచన
- దీనివల్ల ఆకస్మిక గుండె వైఫల్యాలు నివారించొచ్చన్న ఐసీఎంఆర్ సూచన ప్రస్తావన
గుజరాత్ లో దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న యువకులు గుండె పోటుతో మరణించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. సుమారు ఎనిమిది మంది వరకు యువత చనిపోయినట్టు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై మాండవీయ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా బారిన పడిన చరిత్ర ఉన్నవారు. అతిగా శ్రమించడానికి దూరంగా ఉండాలని సూచించారు.
గుజరాత్ మీడియాతో మంత్రి మాండవీయ దీనిపై మాట్లాడారు. ‘‘ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఆ తర్వాత రెండేళ్ల వరకు ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. అప్పుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు’’ అని మాండవీయ చెప్పారు. అంటే గార్భా నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం వెనుక అధిక శ్రమ, కరోనా బారిన పడడాన్ని కారణాలుగా చెప్పినట్టయింది. ఇటీవల గుజరాత్ లో మరణించిన వారిలో 13 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం.