Vishnu Vardhan Reddy: గాంధీ భవన్ వద్ద పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయుల ఆందోళన
- జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
- అజారుద్దీన్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
- గాంధీ భవన్ వద్ద విష్ణు అనుచరుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్తత
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత పి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ బొమ్మను పగులగొట్టారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.