Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే వారికి రైతుబంధు రద్దు: ఈటల రాజేందర్ కీలక ప్రకటన
- వందల ఎకరాలు ఉన్నవారికి, ఆదాయపు పన్ను కట్టే వారికి రైతుబంధు ఇచ్చేది లేదని వెల్లడి
- 150 ఎకరాలు ఉన్న వారికి కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారన్న ఈటల
- బీజేపీ వస్తే కేవలం పేద రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామన్న బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వందల ఎకరాలు ఉన్నవారికి, ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు బంధు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విజయశంఖారావంలో ఆయన రైతుబంధుపై ప్రకటన చేశారు. ప్రస్తుతం 150 ఎకరాలు ఉన్నవారికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నారని, అంటే అలాంటి రైతులకు ఏడాదికి దాదాపు రూ.15 లక్షలు ఈ పథకం ద్వారా వస్తున్నాయన్నారు.
అయితే బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం కేవలం పేద రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామని ప్రకటించారు. వందల ఎకరాల్లో వ్యవసాయం చేసే ధనిక రైతులకు, ఆదాయపు పన్ను కట్టేవారికి రైతుబంధును ఇవ్వమన్నారు. తాము అధికారంలోకి రాగానే వారికి ఈ పెట్టుబడి సాయాన్ని బంద్ చేస్తామన్నారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం కింద 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన ఇస్తోంది. పెద్ద మొత్తంలో భూములు ఉన్నవారికి ఇవ్వడం లేదు.