Revanth Reddy: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీకి రెడీ: రేవంత్ రెడ్డి

Revanth Reddy on Hung and contesting in Kamareddy

  • కేసీఆర్‌ను కొడంగల్ ఆహ్వానించానన్న రేవంత్ రెడ్డి
  • ఉమ్మడి ఏపీ లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు హంగ్‌కు అవకాశం ఇవ్వలేదన్న టీపీసీసీ చీఫ్
  • కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజార్టీతో గెలుస్తుందని ధీమా
  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడి

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాను లేదా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క... ఎవరైనా కామారెడ్డిలో పోటీకి సిద్ధమే అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్‌లను చిత్తుగా ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేయాలని తాను కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఆయన అందుకు సిద్ధపడకుంటే తాను కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమే అన్నారు.

హంగ్‌కు అవకాశం లేదన్న రేవంత్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని, మూడింట రెండొంతుల మెజార్టీతో తమ విజయం ఖాయమన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని తాము కోరామని, నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలన్నారు. విశ్రాంత అధికారులకు పదవులు ఇచ్చి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయివేటు ఆర్మీలా వాడుతున్నారన్నారు. విశ్రాంత అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ అధికారులపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కొత్త ఆర్మీతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించి కేసులు పెడుతున్నారన్నారు. కీలక శాఖలను కొందరు ఐఏఎస్‌లు ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారని, జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్ కీలక శాఖలను నిర్వహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ఎన్నికల కోసం నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు.

  • Loading...

More Telugu News