Kollu Ravindra: చంద్రబాబు లేఖపై విచారణ చేయిస్తారు గానీ... పుంగనూరు ఘటనపై విచారణ చేయరు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra slams YCP govt

  • ఇటీవల పుంగనూరు వద్ద టీడీపీ మద్దతుదారులపై దాడి
  • పసుపు చొక్కాలు విప్పించిన వైసీపీ నేత
  • బీసీలంటే ఎందుకంత చులకన అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై విచారణ చేయిస్తారు గానీ, పుంగనూరులో బీసీలపై జరిగిన దాడులపై విచారణ చేయరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. 

రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో సామాన్య ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడుతున్నారని, వీసా తీసుకుని వెళ్లాలన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. మొన్న పుంగనూరులో జరిగిన సంఘటనను బట్టి ఈ విషయం నిర్ధారణ అవుతోందని అన్నారు. 

"మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఒక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సైకిల్ యాత్రగా వెళుతుంటే పుంగనూరులో వారికి అవమానం జరిగింది. బట్టలూడదీసి కొట్టారు. ఈ ఏరియాకు రావటానికి మీరెవరని చెప్పి దాడి చేశారు. 

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. పుంగనూరును ఏమైనా రిజర్వ్ జోన్ లో పెట్టారా? పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా? అనుమతులు తీసుకొని రావాలా? ఈ వైసీపీ నాయకులకు బీసీలంటే ఎందుకంత చులకన? పుంగనూరులో బీసీలపై జరిగిన దాడి విషయంలో డీజీపీ ఇంతవరకు స్పందించలేదు. చంద్రబాబుగారు రాసిన లేఖపై నిమిషాల్లో విచారణ చేసి చట్టరీత్యా శిక్షిస్తారంటున్నారు. 

చంద్రబాబు, లోకేశ్ లను చూస్తే భయపడే జగన్ ఇప్పుడు పసుపు రంగు చూసినా భయపడుతున్నాడు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారని వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్రలు చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాలను అవమానపరిచిన జగన్ కు సామాజిక యాత్ర చేసే అర్హతలేదు" అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Kollu Ravindra
Chandrababu
Punganuru
YCP Govt
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News