Etela Rajender: కేసీఆర్ రాజీనామా చేయాలి: బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్
- మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందన్న ఈటల
- తమకే పేరు రావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని విమర్శ
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడినప్పుడే నిర్మాణ తీరుపై నిపుణులు హెచ్చరించారని వెల్లడి
- ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులు టూరిస్ట్ స్పాట్‌లుగా మిగిలిపోయాయన్న ఈటల
- ఈ వైఫల్యానికి బాధ్యతగా కేసీఆర్ రాజీనామా చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే
మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో అతికీలకమైన లక్ష్మీ/మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమైన అంశం అన్నారు. తమకే పేరు రావాలనే ఉద్దేశ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. తాము నిన్న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి వచ్చామని, గతంలో విశ్వేశ్వరరెడ్డి పలుమార్లు సందేహాలు వ్యక్తం చేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడిన సమయంలో నిర్మాణ తీరుపై నిపుణులు హెచ్చరించారని తెలిపారు. అలోకేషన్ పద్ధతిలో కావాలనే ప్రాజెక్టులను కొందరికి అప్పగించారన్నారు. ఎలాంటి సాంకేతికత ఉపయోగించనప్పటికీ నాగార్జునసాగర్ డ్యాం చెక్కుచెదరకుండా ఉందన్నారు. కాళేశ్వరంలోని మూడు ప్రాజెక్టులను అతితక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేశారని, ప్రాజెక్ట్ సైట్ ఎంపికలోను ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు.
మేడిగడ్డ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని, ఇసుకమీదే ప్రాజెక్టును కట్టారన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం కూలిందని, ఆ సమయంలో నిపుణులను పంప్ హౌస్ పరిసరాల్లోకి రాకుండా 144 సెక్షన్ విధించి, నిజాలు దాచే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రాజెక్టులు కేవలం టూరిస్ట్ స్పాట్లుగానే మిగులుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టుల విషయంలో అదే ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో వైఫల్యానికి కేసీఆర్ కారణం అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు.