Botsa Satyanarayana: విద్యార్థులందరికీ అంతర్జాతీయ విద్యను అందిస్తాం: బొత్స సత్యనారాయణ
- ఐబీ సిలబస్ తో అన్ని వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను అందిస్తామన్న బొత్స
- ఐదేళ్లలో ప్రభుత్వం రూ. 149 కోట్లను ఖర్చు చేస్తుందని వెల్లడి
- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్న మంత్రి
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకలారియట్) సిలబస్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య సమానంగా అందుతుందని చెప్పారు. ఈ విద్యను ఐదేళ్లలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 149 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.
కార్పొరేట్ సంస్థల్లోని ప్రత్యర్థులతో పోటీ పడేలా మన విద్యార్థులను తయారుచేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విద్యారంగంలో అనేక మార్పులను తీసుకొస్తున్నామని బొత్స తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు.