rishi sunak: ఇజ్రాయెల్ భయంకర తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోంది.. ఆ దేశానికే మా మద్దతు: రిషిసునక్
- ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్
- ఇజ్రాయెల్ తమ పౌరులకు హాని కలగకుండా చర్యలు తీసుకుంటుందన్న రిషి సునక్
- ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా పౌరులూ హమాస్ బాధితులన్న బ్రిటన్ ప్రధాని
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక ప్రకటన చేశారు. తీవ్రవాద సంస్థ హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇప్పుడూ.. ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ దేశానికి అండగా ఉంటామన్నారు. రిషి సునక్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిషి సునక్ మాట్లాడుతూ... హమాస్ లా కాకుండా ఇజ్రాయెల్ తమ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు గాను నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదని, పాలస్తీనా పౌరులను కూడా హమాస్ బాధితులుగా తాము గుర్తిస్తున్నామన్నారు. మానవతా సాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటోందన్నారు.