Ayodhya: అయోధ్య ఆలయంలో పూజారి దారుణ హత్య.. గొంతుకోసి చంపిన దుండగులు

Priest murdered in Ayodhya

  • ప్రఖ్యాత హనుమాన్ గర్హి ఆలయంలో దారుణ ఘటన
  • రామజన్మభూమి ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్ లో హత్య
  • శిష్యులే హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు 

అయోధ్యలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. రామ జన్మభూమిలో ఉన్న ప్రఖ్యాత హనుమార్ గర్హి ఆలయ పూజారిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపిన వివరాల ప్రకారం... హనుమాన్ గర్హి ఆలయంలో పూజారి రామ్ సహరే దాస్ (44) పూజలు నిర్వహిస్తుంటారు. తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆలయానికి పక్కనే ఉన్న గదిలో ఆయన ఉంటున్నారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఓ గదిలో రామ్ సహరే విగత జీవిగా కనిపించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయనను గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ఈ దారుణం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. పూజలు నిర్వహించడానికి రామ్ సహరే రాకపోవడంతో తోటి పూజారులు వెళ్లి ఆయన కోసం వెతుకుతుండగా ఆయన మృతదేహం కనిపించింది. దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. నిన్న రాత్రి పూజారికి, ఆయన శిష్యులకు మధ్య ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

పూజారి శిష్యులే ఈ హత్య చేసి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తుండటంతో వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరో శిష్యుడు పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడం కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

Ayodhya
Priest
Murder
  • Loading...

More Telugu News