countries: ఈ దేశాల్లో నేరాలు అతి తక్కువ..!
- జపాన్, సింగపూర్ లో నేరాలు చాలా తక్కువ
- స్విట్జర్లాండ్ లోనూ భద్రత పాళ్లు ఎక్కువే
- నేరాలు, నిబంధనల ఉల్లంఘనలకు కఠిన శిక్షలు
- వీటితో పోలిస్తే మన దేశంలో ఎన్నో రెట్లు అధిక నేరాలు
కొన్ని దేశాల్లో నేరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన దేశంలోనూ నేరాల సంఖ్య ఎక్కువే. హత్యలు, అత్యాచారాలు, మోసాల కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు.. ఆందోళన పెరిగిపోతుంటుంది. నేరాల్లేని సమాజం ఉంటే బాగుండును.. అని అనుకుంటూ ఉంటాం. అసలు నేరాలు లేని సమాజం గురించి పక్కన పెడితే.. నేరాల రేటు అతి తక్కువ ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి.
- ఐస్ లాండ్ ఎంతో ప్రశాంతత కలిగిన దేశం. నాటో దేశాల్లో తక్కువ జనాభా కలిగినది. ఇక్కడ సైన్యం లేదంటే అర్థం చేసుకోవచ్చు. 2021లో ప్రతి రెండు లక్షల జనాభాకు ఒక నేరం నమోదైంది. ఈ దేశ జనాభా 3.73 లక్షలే కావడం గమనార్హం.
- డెన్మార్క్ నివాసానికి, పర్యాటకానికి సురక్షిత దేశంగా ఉంది. మానవ హక్కులకు ఇక్కడ ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు. పత్రికా స్వేచ్ఛ ఎక్కువ. 2021లో మూడు లక్షల జనాభాకు రెండు నేరాలు నమోదయ్యాయి.
- ఐర్లాండ్ సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. సంతోషకమైన దేశం కూడా. ప్రశాంతత, భద్రత కూడా ఎక్కువ. 2021లో 5 లక్షల జనాభాకు రెండు నేరాలు నమోదయ్యాయి.
- న్యూజిలాండ్ సురక్షిత దేశాల్లో ఒకటి. గొడవలు, నేరాలు చాలా చాలా తక్కువ.
- ఆస్ట్రియా కూడా నివాస యోగ్యమైన దేశం. నేరాల రేటు తక్కువ. నాలుగు లక్షల మందికి మూడు నేరాలు నమోదవుతుంటాయి.
- సింగపూర్ లోనూ భద్రత పాళ్లు ఎక్కువే. ఇక్కడ నిబంధనల ఉల్లంఘనలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. కఠిన శిక్షలు అమలు చేస్తుంటారు. పది లక్షల జనాభాకు ఒకటే నేరం నమోదవుతుంటుంది.
- పోర్చుగల్ లో పని-వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యం ఉంటుంది. పర్యావరణ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత భద్రత ఎక్కువ. ఇక్కడి జనాభా కోటి. 2022లో 3,43,845 నేరాలు నమోదయ్యాయి.
- ప్రశాంత జీవనానికి అనుకూలమైన టాప్-10 దేశాల్లో స్లోవేనియా కూడా ఒకటి. ఇక్కడ భద్రత ఎక్కువ. 5 లక్షల మంది జనాభాకు ఇక్కడ 2021లో 2 నేరాలు నమోదయ్యాయి.
- జపాన్ నాణ్యమైన జీవనానికి పెట్టింది పేరు. జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 85 సంవత్సరాలు. కానీ మన దేశంలో ఇది 70 సంవత్సరాలుగానే ఉంది. ఇక్కడి నేరాల రేటు నాలుగు లక్షల మందికి ఒక్కటంటే ఒక్కటి.
- స్విట్జర్లాండ్ లో నేరాల రేటు చాలా తక్కువ. ప్రతి 2 లక్షల మందికి గాను 2021లో అక్కడ ఒక్క నేరమే చోటు చేసుకుంది.
- చివరిగా మన భారత్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి లక్ష మంది జనాభాకు ఏటా 445.9 నేరాలు (2021 లెక్కల ప్రకారం) నమోదవుతుంటాయి.