Azam Khan: సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్, భార్య, కుమారుడికి జైలు శిక్ష
- నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కేసులో జైలుకు అజంఖాన్ కుటుంబం
- బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు
- అజంఖాన్, భార్య, కుమారుడ్ని దోషులుగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు
ఉత్తరప్రదేశ్ విపక్షం సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత అజంఖాన్, భార్య తంజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజం ఖాన్ (మాజీ ఎమ్మెల్యే)కు కోర్టు జైలు శిక్ష విధించింది. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఈ ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది.
గతంలో వీరిపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కుమారుడు అబ్దుల్లా కోసం అజంఖాన్ రెండు తేదీలతో బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఫోర్జరీకి కూడా పాల్పడ్డారని వివరించారు. రాంపూర్ లోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరిగింది.
కాగా, వివాదాస్పద నేతగా పేరుపొందిన అజంఖాన్ కు గత నెల రోజుల వ్యవధిలో శిక్ష పడిన కేసుల సంఖ్య నాలుగుకి పెరిగింది. ఆయన తనయుడు అబ్దుల్లా అజంఖాన్ దోషిగా తేలిన రెండో కేసు ఇది.