Revanth Reddy: 'కాంగ్రెస్ గెలిచాక సోనియా ఎదుట మొదటి ఉద్యోగం నీకే' అంటూ యువతికి రేవంత్ రెడ్డి 'గ్యారెంటీ' హామీ

Revanth Reddy promises job to Nampally woman

  • రేవంత్ రెడ్డిని కలిసిన నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని
  • డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం రోజునే ఉద్యోగం ఇస్తామని హామీ
  • స్వయంగా గ్యారెంటీ కార్డు రాసిచ్చిన రేవంత్ రెడ్డి

తాము అధికారంలోకి వస్తే తొలి ఉద్యోగం నీకేనంటూ ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని అనే అమ్మాయి... రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, కానీ ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగంలేక ఇబ్బందిగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఆమె ఆవేదనను విన్న రేవంత్ రెడ్డి... ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు వస్తారని, ఆ రోజున వారి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు తాను గ్యారెంటీ అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును రజిని పేరుతో రేవంత్ స్వయంగా రాసిచ్చారు.

ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డి

కాగా, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక అంశంపై స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యపై పోలీసు అధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఆమె కుటుంబం పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారని మండిపడ్డారు. ప్రవళికకు సంబంధించిన హాల్ టిక్కెట్, సహా అన్ని వివరాలు ఉన్నాయన్నారు. కానీ పోలీసు అధికారి మాత్రం ప్రేమ విఫలమై చనిపోయినట్లుగా చెప్పడం విడ్డూరమన్నారు.

ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామన్నారు. అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందో చెప్పాలన్నారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి ఉండాలన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. డీసీపీపై ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News