Kilaru Rajesh: స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్.. ఎక్కడికీ పారిపోలేదని వ్యాఖ్య
- రాజేశ్ కు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ
- తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వచ్చిన రాజేశ్
- విచారణకు సహకరిస్తానని వ్యాఖ్య
ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్ మెంట్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారు రాజేశ్ ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ రెండు రోజుల క్రితం రాజేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు.
మరోవైపు కిలారు రాజేశ్ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు సన్నిహితుడు అని వైసీపీ నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. రాజేశ్ విదేశాలకు పారిపోయారని ఇటీవల ప్రెస్ మీట్ లో సీఐడీ అధికారులు చెప్పారు. దీనిపై రాజేవ్ స్పందిస్తూ... తాను విదేశాలకు పారిపోలేదని చెప్పారు. తాను ఏపీలోనే ఉన్నానని తెలిపారు. సీఐడీ విచారణకు సహకరిస్తానని చెప్పారు.
ఇంకోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును రాజేశ్ ఆశ్రయించారు. గత శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే, రాజేశ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని... ఆయనను అరెస్ట్ చేయబోమని, 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. అరెస్ట్ లేనందువల్ల ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు వెల్లడించింది.