Revanth Reddy: 40 ఏళ్లు పార్టీలో పనిచేసి వీడడానికి సిగ్గుండాలి.. పొన్నాలపై రేవంత్ ఫైర్

TPCC Chief Revanth Reddy Slams Ponnala Lakshmaiah
  • పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి 40 వేల ఓట్లతో ఓడిపోయారన్న రేవంత్
  • పార్టీని బలహీనం చేసేందుకే రాజీనామా చేశారన్న పీసీసీ చీఫ్
  • జనగామ టికెట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురిలో పొన్నాల కూడా ఉన్నారన్న రేవంత్
  • 75 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
  • రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక బస్సు యాత్ర ఉంటుందన్న రేవంత్
ఎన్నికల వేళ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీలో ఉండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజల్లో ఉండి సేవ చేస్తే ఎందుకు గెలవరని ప్రశ్నించారు. 

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి కూడా 40 వేల ఓట్లతో ఓసారి, 50 వేల ఓట్లతో ఇంకోసారి ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారే చేయలేదని పేర్కొన్నారు. జనగామ టికెట్ కోసం ముగ్గురిని ఎంపిక చేస్తే అందులో పొన్నాల కూడా ఉన్నారని తెలిపారు. అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాకుండానే రాజీనామా చేయడం వెనకున్న కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే పార్టీని దెబ్బతీయడానికి, బలహీన పర్చడానికే ఆయన రాజీనామా చేసినట్టు ఉందని ఆరోపించారు. కార్యకర్తలకే బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నం తినేవాళ్లు ఎవరైనా రేవంత్ పైసలు తీసుకున్నాడని అంటారా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఒక్కడే టికెట్లు ఇవ్వడని, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసి టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో విడతల వారీగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్ర ఉంటుందని రేవంత్ తెలిపారు. తెలంగాణలో 75కు పైగా సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో లక్షలాదిమందితో ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
Revanth Reddy
Ponnala Lakshmaiah
Congress

More Telugu News