Atchannaidu: చంద్రబాబు ప్రాణానికి హాని తలపెడుతున్నారు: అచ్చెన్నాయుడు

TDP leaders concern on Chandrababu health
  • చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారన్న అచ్చెన్నాయుడు
  • ఇతర మందులు ఇస్తూ ఆయన ప్రాణానికి హాని తలపెడుతున్నారని మండిపాటు
  • నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గారని ఆందోళన
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారని చెప్పారు. స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు ఏసీ అవసరమని తెలిపారు. వేడి ఉష్ణోగ్రతను ఆయన తట్టుకోలేరని అన్నారు. ఆయన స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. 

జైల్లో చంద్రబాబుకు ఇతర మందులు ఇస్తూ ప్రాణానికి హాని తలపెడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నెల రోజుల్లో చంద్రబాబు ఏకంగా 5 కేజీల బరువు తగ్గారని.. ఈ స్థాయిలో బరువు తగ్గడం ప్రమాదకరమని డాక్టర్లు చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చిన తర్వాత ఒక వైద్య బృందాన్ని జైలుకు పంపించారని... ఆ డాక్టర్లు వాస్తవ రిపోర్టును రాయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఆయన వ్యక్తిగత వైద్యుల చేత టెస్ట్ లు చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గమనించాలని కోర్టులను కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని అన్నారు.
Atchannaidu
Chandrababu
Telugudesam
Health

More Telugu News