Chandrababu: ఐఆర్ఆర్ కేసు: పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- పీటీ వారెంట్లపై ఏసీబీ న్యాయస్థానంలో విచారణ
- హైకోర్టులో మధ్యంతర బెయిల్ సహా పలు పిటిషన్లు ఉన్నందున పాస్ ఓవర్ అడిగిన న్యాయవాదులు
- పాస్ ఓవర్‌కు ఏసీబీ న్యాయమూర్తి అనుమతి
- రైట్ టు ఆడియన్స్ కింద వాదనలు వినాలన్న చంద్రబాబు పిటిషన్ డిస్మిస్
చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా పీటీ వారెంట్ల పిటిషన్ వాదనలపై టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. ఏసీబీ న్యాయమూర్తి పాస్ ఓవర్‌కు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ తదితర బెయిల్స్ విచారణలో ఉన్నందున ఆయన తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, ఫైబర్ నెట్ కార్పోరేషన్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో నెల రోజుల క్రితం పీటీ వారెంట్లు దాఖలు చేసింది. పీటీ వారెంట్లపై మొన్న విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ కేసు విచారణ నిన్నటికి, ఆ తర్వాత నేటికి వాయిదా పడింది.
ఈ రోజు మధ్యాహ్నం కేసు విచారణ ప్రారంభమైంది. అయితే ముందు రైట్ టు ఆడియన్స్ కింద వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా, ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. మరోవైపు, హైకోర్టులో పీటీ వారెంట్లు, చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ సాగుతోందని, కాబట్టి పాస్ ఓవర్ కావాలని టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. దీనికి ఏసీబీ న్యాయమూర్తి అనుమతించారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు ఇరువైపుల న్యాయవాదులు ఏసీబీ న్యాయమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు కాస్త ఊరట దక్కిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పీటీ వారెంట్లు, కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.