TDP: పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు.. తప్పుడు ఆరోపణలు: అచ్చెన్నాయుడు

TDP Senior Leader Acham Naidu Press Meet

  • స్కిల్ కేసులో 3,300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారన్న అచ్చెన్న
  • ఆ తర్వాత 371 కోట్ల అవినీతి అన్నారు.. తాజాగా కోర్టులో 27 కోట్లని వాదించారని వ్యాఖ్య 
  • పార్టీ ఖాతాలోకి వచ్చే నిధులకు అవినీతికి సంబంధమేంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు

తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ దిశగా ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మచ్చలేని నాయకుడని, అలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 28 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో ఉండడంతో ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని వివరించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. అయితే, చంద్రబాబు తప్పుచేసే వ్యక్తి కాదని తాము తొలి రోజు నుంచీ చెబుతూనే ఉన్నామని వివరించారు. తన జీవితంలో చిన్న తప్పు కూడా చేయరని.. తప్పు చేసే వారిని విడిచిపెట్టరని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు తప్పుడు ఆరోపణలు చేసి, అసత్య ప్రచారం చేసి జైలుకు పంపించారని వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ కేసు అంటూ లేని అవినీతిని అంటగడుతూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరోపణల్లో నిజానిజాలను తేల్చడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు టీడీపీ పుస్తకాలు ప్రచురించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై తొలి పుస్తకాన్ని అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. ‘స్కిల్ పై నిందలు వేయడమంటే.. యువత భవితపై దాడి చేయడమే’ అంటూ టీడీపీ ముద్రించిన పుస్తకాన్ని మీడియాకు చూపించారు. ఈ పుస్తకాన్ని జనాలకు అందించి, స్కిల్ డెవలప్ మెంట్ లో ఏం జరిగిందనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తామని అచ్చెన్నాయుడు వివరించారు.

More Telugu News