US Deep Recession: తీవ్ర ఆర్థికమాంద్యం దిశగా అమెరికా.. ఇండియాపై పెను ప్రభావం!

USA towards deep recession and impact on India

  • అమెరికా తీవ్ర ఆర్థికమాంద్యంలోకి జారుకోబోతోందన్న యాక్సిన్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ మిశ్రా
  • యూఎస్ రెసిషన్ నాలుగు విధాలుగా ఇండియాపై ప్రభావం చూపుతుందని హెచ్చరిక
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు గురవుతాయని వ్యాఖ్య

త్వరలోనే అమెరికా తీవ్ర ఆర్థికమాద్యంలోకి జారుకోబోతోందని ఇండియన్ టాప్ ఎకనామిస్టుల్లో ఒకరైన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా హెచ్చరించారు. ఇది ఇండియన్ జీడీపీలో ప్రధాన భాగమైన సర్వీస్ సెక్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. ఇండియన్ బాండ్, ఈక్విటీ మార్కెట్లపై యూఎస్ రెసిషన్ పెను ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇండియాతో పాటు పలు దేశాలపై అమెరికా ఆర్థికమాంద్యం ప్రభావం చూపుతుందని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఆధార్)కు నీలకంఠ్ మిశ్రా పార్ట్ టైమ్ ఛైర్ పర్సన్ గా కూడా గతంలో వ్యవహరించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన యూఎస్ ఆర్థికమాంద్యంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ ఏడాదే అమెరికా ఆర్థికమాంద్యంలోకి జారుకోబోతోందని నీలకంఠ్ మిశ్రా తెలిపారు. యూఎస్ ఆర్థిక లోటు ఆ దేశ జీడీపీలో ఈ ఏడాది మరో 4 శాతం పెరిగిందని చెప్పారు. ఒకవేళ వచ్చే ఏడాది అమెరికా తన ఆర్ఠిక లోటును ఫ్లాట్ గా ఉంచినా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందని, ఇదే అతి పెద్ద సమస్య అని తెలిపారు. అమెరికా ఆర్థిక లోటు ఎక్కువగా ఉండటంతో... యూఎస్ బాండ్లు కొనేందుకు ఎవరూ వేచి చూడటం లేదని చెప్పారు. కీలక వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని... దీంతో ప్రపంచ వ్యాప్త డిమాండ్ పై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్ల రాబోయే ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పారు. 

ఇండియాపై యూఎస్ రెసిషన్ ప్రభావం:

యూఎస్ రెసిషన్ ఇండియాపై నాలుగు విధాలుగా తీవ్ర ప్రభావం చూపుతుందని నీలకంఠ్ మిశ్రా తెలిపారు. సర్వీస్ సెక్టార్ తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే సర్వీసెస్ వృద్ధి రేటు నెమ్మదించిందని... ఇది మరింత నెమ్మదిస్తుందని తెలిపారు. ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, బిజినెస్ సర్వీసెస్ ఎగుమతులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఇండియన్ ఎక్స్ పోర్ట్స్ లో 10 శాతం సర్వీసెస్ ఎక్స్ పోర్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఈ సెక్టార్ పతనమైతే మన జీడీపీ 1 శాతం వృద్ధి రేటును కోల్పోతుందని తెలిపారు. 

అమెరికా ఆర్థికమాంద్యం ప్రభావం చూపే రెండో విభాగం వస్తు ఎగుమతులని మిశ్రా చెప్పారు. మన దేశ వస్తు ఎగుమతులకు డిమాండ్ పడిపోతుందని తెలిపారు. ఇప్పటికే చైనా, జపాన్, యూరోపియన్ దేశాల ఎగుమతులపై ప్రభావం ప్రారంభమయిందని చెప్పారు. ఇండియా ఎదుర్కోబోయే అతి పెద్ద సమస్య... ఈ దేశాలన్నీ వాటి ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేస్తాయని తెలిపారు. 

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఇండియాలో డిమాండ్ ఎప్పటి మాదిరిగానే సాధారణంగా ఉంటే... ప్రపంచంలోని ప్రతి ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాడని చెప్పారు. ఇది మన స్వదేశీ కంపెనీలపై పెను ప్రభావం చూపుతుందని అన్నారు. ఇది మూడో అతిపెద్ద సమస్య అని చెప్పారు. 

అమెరికా ఆర్థికమాంద్యం ఆదేశ గవర్నమెంట్ బాండ్ల రాబడిపై ప్రభావం చూపుతుందని మిశ్రా తెలిపారు. దీని కారణంగా ఇతర దేశాల క్యాపిటల్ కాస్ట్ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలోని అతిపెద్ద రుణగ్రహీతలైన ప్రఖ్యాత స్టీల్ కంపెనీల వంటి వాటికి ఇంతకు ముందు డాలర్ లోన్స్ ఈజీగా దొరికేవని... గత 6 నుంచి 8 నెలలుగా అలాంటి లోన్లు దొరకడం లేదని తెలిపారు. ఇది బాండ్ మార్కెట్స్, ఈక్విటీ మార్సెట్స్ పై పెను ప్రభావం చూపుతుందని... ఈ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయని చెప్పారు. 

గత రెండు మూడు రోజులుగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయని... ప్రజల ఆర్థికమాంద్య భయాలే దీనికి కారణమని మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది మే - జూన్ సమయానికి ఆయిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని... అలా కాకుండా, ఆయిల్ ధరలు పెరిగితే ఇండియన్ ఎకానమీపై మరింత నెగెటివ్ ప్రభావం చూపుతుందని చెప్పారు.  

ఒకవేళ ఆర్థికమాంద్యం తప్పని పరిస్థితుల్లో, దాని ప్రభావం నుంచి ఇండియా బయట పడాలంటే... మాక్రోఎకనామిక్ స్థిరత్వంపై దృష్టిసారించాలని మిశ్రా సూచించారు. అస్థిరత్వం, అల్లకల్లోలం నుంచి బయటపడాలంటే రిస్క్ తీసుకోకూడదని చెప్పారు. మాక్రోఎకనామిక్ స్టెబిలిటీ సుదీర్ఘ వృద్ధికి అండగా ఉంటుందని తెలిపారు. 

వచ్చే ఏడాది లేదా ఒకటిన్నర సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ భారీ కుదుపులకు గురవుతాయని మిశ్రా చెప్పారు. మనమంతా అదృష్టవంతులైతే ఏడాదిన్నరలో సంక్షోభం ముగుస్తుందని... లేకపోతే, సంక్షోభం ఐదేళ్ల పాటు కొనసాగొచ్చని తెలిపారు. మన దేశ మధ్య తరగతి ప్రజలపై అమెరికా ఆర్థికమాంద్యం చూపే ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ... మరో 5 నుంచి 7 ఏళ్ల పాటు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతానికైతే అంతా సవ్యంగా కనిపిస్తోందని తెలిపారు. అయితే, రెసిషన్ ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News