Tomato Price: 30 కిలోల టమాటాల ధర ఒక్క కప్పు టీకి సమానం

Tomato Price Falls To 30 Paise Per Kg At Pattikonda Market in Kurnool District
  • కర్నూలులో భారీగా పడిపోయిన టమాటా ధర
  • కిలో 30 పైసలు పలకడంతో విలవిలలాడుతున్న రైతు
  • మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం

మొన్న కిలో రూ.300 లకు చేరిన టమాటా ధర ఈ రోజు కిలో 30 పైసలకు పడిపోయింది.. కొన్నిరోజులుగా టమాటా సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధర దారుణంగా పడిపోయింది. కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొస్తే పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. కనీస ధర కూడా రాకపోవడంతో విలవిలలాడుతున్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 30 పైసలు పలకడంతో రైతులు మండిపడుతున్నారు. మార్కెట్లో కప్పు టీ తాగడానికి కనీసం 30 కిలోల టమాటాలను అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ. 20 కి అమ్ముతుండగా.. హోల్ సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు టమాటా పంటను కొనుగోలు చేస్తుందని అధికారులు చెప్పారు. అయితే, ఈ హామీ కేవలం నోటి మాటకే పరిమితమైందని రైతులు విమర్శిస్తున్నారు. కిలో 30 పైసలకు మించి ధర రాకున్నా మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News