YS Sharmila: పాలేరు సీటు వదులుకోవడానికి వైఎస్ షర్మిల ఓకే.. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలతో భేటీ!

YS Sharmila To Go Delhli To Meet Congress High Command

  • తొలుత పాలేరు సీటు కావాలని పట్టు
  • ఆమె సేవలను ఏపీలో వినియోగించుకోవాలని రేవంత్ వర్గం యోచన
  • ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి షర్మిల!
  • విలీనంపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం

తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం ఆ తర్వాత చల్లబడింది. అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు షర్మిల కానీ ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో రానున్న ఎన్నికల్లో షర్మిల ఒంటరిగానే ప్రచారం చేస్తారని భావించారు. తాజాగా, ఈ విషయంలో మళ్లీ కదలిక వచ్చింది. 

షర్మిలకు తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రేపు, లేదంటే ఎల్లుండి ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఈసారి విలీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  నిజానికి వైఎస్సార్ టీపీని  కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించినా పాలేరు సీటు కోరుతుండడంతో చిక్కుముడి పడింది. 

షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నేతలు తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. షర్మిల మాత్రం తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడు ఆమె ఓ మెట్టుదిగి వచ్చారని, పాలేరు సీటు కాకుండా ఖమ్మం లోక్‌సభ సీటు కేటాయించాలని కోరుతున్నట్టు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల ఢిల్లీ పర్యటన తర్వాత విలీన ప్రకటన ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News