Tamannaah: దక్షిణాది సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా
- సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉంటుందన్న తమన్నా
- హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని విమర్శ
- అందుకే చాలా సినిమాలు వదులుకుంటున్నానని వ్యాఖ్య
ఉత్తరాది భామలకే దక్షిణాది సినిమాలలో ఎక్కువ ఛాన్సులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ స్టార్ డమ్ సంపాదించుకుని, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అయినప్పటికీ తమకు అన్నీ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీపై వారికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బాలీవుడ్ కు చెక్కేద్దామా అనే ఆలోచనలోనే ఉంటారు. అంతేకాదు, బాలీవుడ్ ఆఫర్లు రాగానే సౌత్ సినీ పరిశ్రమపై విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో తమన్నా కూడా చేరింది.
కొంతకాలంగా ఆఫర్లు లేక ఇబ్బంది పడ్డ తమన్నాకు ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఆమె బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... హీరోయిన్ కావాలనే ఆశతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తాను ఎంతో శ్రమిస్తున్నానని చెప్పింది.
కొన్ని సినిమాలను కావాలనే వదిలేసుకోవాల్సి వస్తోందని... దీనికి కారణం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతే అని తమన్నా వ్యాఖ్యానించింది. సౌత్ సినిమాలు పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంటాయని... సినిమా మొత్తం హీరోయిజమే ఉంటుందని, హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదని చెప్పింది. అందుకే ఇలాంటి సినిమాల్లో భాగం కాకూడదనే ఆలోచనతో చాలా సౌత్ సినిమాల ఆఫర్లను వదులుకుంటున్నానని తెలిపింది.