Millionaire: వయస్సు తగ్గించుకోవడానికి రోజుకు 111 మాత్రలు మింగుతున్న కుబేరుడు
- ‘రివర్స్ ఏజింగ్’ కోసం ఏటా 20 లక్షల డాలర్ల ఖర్చు
- 30 మంది వైద్యులతో నిరంతరం పరీక్షలు, ప్రయోగాలు
- 46 ఏళ్ల వయసులో టీనేజ్ యువకుడిగా మారాలని ప్రయత్నం
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ గుర్తున్నాడా.. నిత్యం యవ్వనంతో ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా తెలిసే ఉంటుంది. చావును జయించాలని ప్రయత్నించిన జాక్సన్ దురదృష్టవశాత్తూ అకాల మరణం పొందారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ కుబేరుడు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. వయస్సును, మరణాన్ని జయించేందుకు రోజుకు ఏకంగా 111 మాత్రలు మింగుతున్నాడు. ఆరోగ్యంపై నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికి 30 మంది వైద్యుల బృందాన్ని నియమించుకుని మరీ రివర్స్ ఏజింగ్ కోసం కష్టపడుతున్నాడు.
ఏటా 20 లక్షల డాలర్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాడు. ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ పేరుతో ఈ ప్రయోగాలు చేస్తున్న ఆ కుబేరుడి పేరు బ్రయాన్ జాన్సన్.. అమెరికాకు చెందిన ఈ వ్యాపారవేత్తకు 30 ఏళ్ల వయసులో అదృష్టం తోడయ్యింది. ఆయన కంపెనీ బ్రెయిన్ ట్రీ పేమెంట్ సొల్యూషన్ కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ కంపెనీని 800 మిలియన్ డాలర్లకు ఈబే కంపెనీకి అమ్మేశాడు. నలభై ఏళ్లు పైబడడంతో వృద్ధాప్యం తన చెంతకు రాకుండా నిత్యం యవ్వనంతో ఉండేందుకు వైద్యులతో కలిసి ప్రయోగాలు చేస్తున్నాడు. 46 ఏళ్ల వయసున్న బ్రయాన్.. తన శరీరంలోని అవయవాల పనితీరును 18 ఏళ్ల వయసున్న కుర్రాడి అవయవాల్లా పనిచేయాలని భావిస్తున్నాడు.
ఇందుకోసం తన కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. తన ఆరోగ్యాన్ని, అవయవాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రకరకాల వైద్య పరికరాలను సమకూర్చుకున్నాడు. రాత్రిపూట నిద్రించే ముందు తన శరీరానికి పలు పరికరాలను అమర్చుకుంటాడు.. అంతేకాదు రాత్రిపూట చేయాల్సిన డిన్నర్ రోజూ ఉదయం 11 గంటలకు తింటాడట. వైద్యుల సూచనలకు అనుగుణంగా తన ఆహారపుటలవాట్లను కూడా మార్చుకున్నాడు. ఇదంతా స్వయంగా బ్రయాన్ జాన్సన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే తన ఎలక్ట్రిక్ కారులో గంటకు 16 మైళ్ల (25 కిలోమీటర్లు) వేగం మించకుండా వెళతానని వివరించాడు. కాగా, బ్రయాన్ జాన్సన్ నెట్ వర్త్ 400 మిలియన్ డాలర్లు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో ప్రచురించింది.