Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ 70 నుంచి 74 స్థానాల్లో గెలుస్తుంది... గ్యారంటీ కార్డులు జాగ్రత్త!: మల్లు భట్టివిక్రమార్క

Congress will win 70 seats in telangana
  • అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామన్న భట్టివిక్రమార్క 
  • తమ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ ఆగమవుతోందని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తాయన్న టీ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత
  • ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 74 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో తమ పార్టీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర రావు పార్టీలో చేరాక తొలిసారి ఖమ్మం రావడంతో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మల్లు భట్టితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని తు.చ తప్పకుండా పాటిస్తామన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్ ఆగమవుతోందన్నారు. బీఆర్ఎస్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తిరిగి అప్పజెబుతామని తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర సంపదను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తాయన్నారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, మొత్తం సీట్లు గెలుస్తామన్నారు. తాము ఇచ్చే గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. తాము ఆషామాషీగా గ్యారెంటీలు ఇవ్వడం లేదని చెప్పారు. లోతుగా పరిశీలించాకే గ్యారంటీ హామీలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో సంపద ఉంది కాబట్టి గ్యారంటీగా హామీలను అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.
Mallu Bhatti Vikramarka
Telangana
Congress

More Telugu News