Nara Bhuvaneswari: గత 10 రోజులుగా రాజమండ్రిలోనే భువనేశ్వరి, బ్రాహ్మణి

Nara Bhuvaneswari and Brahmani resides in Rajahmundry for ten days

  • సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్
  • రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు
  • కష్టకాలంలో భర్తకు దగ్గరగా భువనేశ్వరి... అత్తకు తోడుగా నారా బ్రాహ్మణి

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఈ నెల 9న అరెస్ట్ చేయడం తెలిసిందే. చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, ఆమె కోడలు నారా బ్రాహ్మణి గత 10 రోజులుగా రాజమండ్రిలోనే ఉంటున్నారు. 

మొదట్లో యువగళం బస్సులోనే బస చేసిన భువనేశ్వరి, బ్రాహ్మణి గత కొన్నిరోజులుగా క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారు. చంద్రబాబుకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం అంగీకరించడంతో, భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబుకు భోజనం పంపిస్తున్నారు. కష్టకాలంలో భర్తకు దగ్గరగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. అత్తకు తోడుగా బ్రాహ్మణి కూడా రాజమండ్రిలోనే ఉంటున్నారు. 

తన భర్త నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, బ్రాహ్మణి క్యాంప్ ఆఫీసుకు వస్తున్న న్యాయవాదులతో మాట్లాడడం, పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం వంటి కార్యకలాపాలతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం కలిగిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ హెడ్ క్వార్టర్స్ కు రాజమండ్రి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

సాధారణంగా చంద్రబాబు ప్రతి రెండు గంటలకోసారి స్వల్పంగా ఆహారం తీసుకుంటారు. అయితే, అనుమతికి సంబంధించిన చిక్కులు ఉండడంతో ఎక్కువసార్లు ఆహారం పంపించడం సాధ్యం కావడంలేదు. దాంతో, ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం బ్రౌన్ రైస్, బ్లాక్ కాఫీ తాగేందుకు వేడి నీళ్లు పంపిస్తున్నారు. యువగళం బస్సు పక్కనే ఓ వ్యాన్ లో చంద్రబాబుకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి పంపిస్తున్నారు. 

కాగా, భువనేశ్వరిని పరామర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన మహిళా నేతలు రాజమండ్రి తరలివస్తున్నారు. వారందరితో భువనేశ్వరి భేటీలను బ్రాహ్మణి సమన్వయం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News