C-Section: ఆస్ట్రేలియా ఆసుపత్రి నుంచి 5 వేల కోట్ల పరిహారం కోరిన ఎన్నారై.. కోర్టులో చుక్కెదురు
- ఆసుపత్రిలో భార్య సిజేరియన్ ఆపరేషన్ ప్రత్యక్షంగా వీక్షించిన ఎన్నారై భర్త
- ఆ దృశ్యంతో తాను మానసిక వ్యాధి బారినపడ్డానంటూ కోర్టులో పిటిషన్
- తన విషయంలో ఆసుపత్రి విధి నిర్వహణలో విఫలమైందని ఆరోపణ
- ఎన్నారైకి వాస్తవిక నష్టం ఏదీ జరగలేదంటూ అతడి పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
భార్య సిజేరియన్ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తనను ప్రోత్సహించి మానసిక వ్యాధి బారిన పడేలా చేసిన ఆస్ట్రేలియా ఆసుపత్రిపై ఓ ఎన్నారై కేసు వేశారు. తనకు పరిహారం కింద 5 వేల కోట్లు చెల్లించాలంటూ రాయల్ విమెన్స్ ఆసుపత్రిని అనీల్ కొప్పుల డిమాండ్ చేశారు. అయితే, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తాజాగా కొట్టేసింది.
2018లో ఆ ఆసుపత్రిలో అనీల్ భార్యకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. ఈ సందర్భంగా రక్తమాంసాలు, అంతర్గత అవయవాలు వీక్షించిన తాను సైకోసిస్(మానసిక రుగ్మత) బారినపడ్డానని అనీల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత కాపురం కూలిపోయిందని ఆరోపించారు. ఆసుపత్రి తన విధి నిర్వహణలో విఫలమైందని, తన మానసిక ఆరోగ్యం దెబ్బతినేలా చేసిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అనీల్ కొప్పుల ఆరోపణలను విక్టోరియా రాష్ట్ర సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆయన వ్యవస్థను డుర్వినియోగ పరిచాడని అభిప్రాయపడింది. ఆసుపత్రి చర్య కారణంగా పిటిషనర్‌కు వాస్తవిక నష్టం ఏదీ వాటిల్లలేదని పేర్కొంది. పిటిషనర్ ఆర్థికంగా నష్టపోలేదని, చట్ట ప్రకారం అతడి మానసిక గాయం తీవ్రమైనదిగా పరిగణించలేమంటూ అతడి పిటిషన్‌ను కొట్టేసింది.
భార్యల ప్రసవాలను భర్తలు ప్రత్యక్షంగా వీక్షించడం పాశ్చాత్య సంస్కృతిలో ఒక భాగం. సిజేరియన్ లేదా సాధారణ డెలివరీలను భర్తలు దగ్గరుండీ చూసేందుకు అక్కడి ఆసుపత్రులు అనుమతిస్తాయి. భార్య బిడ్డకు జన్మనివ్వడం ప్రత్యక్షంగా చూశాక చాలా ప్రభావితమయ్యామని అక్కడి వారు చెబుతుంటారు.