Parliament: ప్రస్తుతం ఏ పార్టీలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారంటే..!
- ప్రస్తుతం లోక్ సభలో 14 శాతం మంది మహిళా సభ్యులు
- రాజ్యసభలో మహిళల వాటా 10 శాతం
- లోక్ సభలో 78 మంది, రాజ్యసభలో 24 మంది మహిళలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు (మంగళవారం) మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మహిళా రిజర్వేషన్లపై చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ లో మహిళల భాగస్వామ్యం ఏమేరకు ఉంది.. ఏయే పార్టీలో ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారనే వివరాలు..
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 78 మంది మహిళలు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. రాజ్యసభలో మొత్తం 24 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఉభయ సభలలో 103 మంది మహిళలు ఉన్నారు. శాతాల వారీగా సభలో పరిశీలిస్తే.. లోక్‌సభలో 14.36 శాతం, రాజ్యసభలో 10 శాతానికి పైగా మహిళా సభ్యులు ఉన్నారు. 1951 నుండి 2019 వరకు లోక్‌సభలో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఏయే పార్టీలో ఎంతమంది.. లోక్ సభ..
లోక్ సభలో 301 మంది ఎంపీలున్న బీజేపీ నుంచి అత్యధికంగా 42 మంది మహిళా ఎంపీలు ఉండగా.. కాంగ్రెస్ 7 (51 ఎంపీలలో), డీఎంకే 2(24 ఎంపీలలో), టీఎంసీ 9(23 ఎంపీలలో), వైసీపీ 3(22ఎంపీలలో) , శివసేన 2(19ఎంపీలలో), జేడీయూ 0(16ఎంపీలలో), బీజేడీ 5(12ఎంపీలలో) , బీఎస్పీ 1(9ఎంపీలలో), బీఆర్ఎస్ 1(9ఎంపీలలో) ఇతరులు మరో ఆరుగురు మహిళా సభ్యులు ఉన్నారు.
రాజ్యసభలో..
బీజేపీ 13 (మొత్తం 94 మంది), కాంగ్రెస్ 5 (30 మంది), టీఎంసీ 2 (13 మంది), డీఎంకే 1 (10 మంది), బీజేడీ 2 (9 మంది), ఆర్జేడీ 1 (ఆరుగురు)