Parliament: పార్లమెంట్ పాత బిల్డింగ్ ను ఏంచేస్తారు..?
- బ్రిటిష్ పాలనలో నిర్మించిన భారీ కట్టడం
- స్వాతంత్ర్య పోరాటానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన భవనం
- నేటి నుంచి కొత్త భవనమే ఇక పార్లమెంట్
స్వాతంత్ర్య పోరాటం సహా ఎన్నో చారిత్రాత్మక విషయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది పార్లమెంట్ పాత భవనం.. గొప్ప రాజనీతిజ్ఞులను చూసింది, చారిత్రక నిర్ణయాలకు వేదికయ్యింది. ఇదే బిల్డింగ్ లో అప్పటి నేతలు రాజ్యాంగాన్నిఆమోదించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న భవనం భవిష్యత్తు ఏం కానుంది? కొత్త బిల్డింగ్ లోకి పార్లమెంట్ మారిన నేపథ్యంలో పాత భవనాన్ని ప్రభుత్వం ఏంచేయనుంది..? కూల్చేస్తుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
మంగళవారం కొత్త భవనంలోకి పార్లమెంట్ మారిన నేపథ్యంలో పాత భవనాన్ని భవిష్యత్తులో ఓ మ్యూజియంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం పాత బిల్డింగ్ లో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్ ను కొత్త బిల్డింగ్ లోకి మార్చేయాలని, ఆపై ఈ పాత బిల్డింగ్ ను ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చనే మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు సమాచారం.
పార్లమెంట్ పాత భవనాన్ని బ్రిటిష్ పాలనలో 1927 లోనే నిర్మించారు. ఈ భవనానికి బ్రిటిష్ ఆర్కిటెక్చర్లు సర్ ఎడ్విన్ లుట్నీస్, హెర్బర్ట్ బేకర్ లు డిజైన్ చేశారు. దాదాపు 96 ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోతోంది. దీంతో మరింత విశాలంగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్డింగ్ ను రికార్డు సమయంలో నిర్మించింది.
పాత బిల్డింగ్ కు అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి ఇతర అవసరాలకు వాడతామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గతంలో రాజ్యసభలో వెల్లడించారు. కాగా, మంగళవారం నుంచి కొత్త భవనమే ఇక పార్లమెంట్ గా అధికారికంగా గుర్తింపు పొందనుంది.