Revanth Reddy: బీఆర్ఎస్‌కు మిగిలింది 99 రోజులే... ఆ పార్టీ రోజులు లెక్కబెట్టుకుంటోంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy says BRS will remain only 99 days

  • 16, 17, 18 తేదీలు దేశరాజకీయాల్లో చారిత్రాత్మకమైన రోజులన్న రేవంత్
  • సోనియా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పదేళ్ల పాలనను పోల్చి చూడాలని విజ్ఞప్తి

బీఆర్ఎస్ పార్టీకి ఇక మిగిలింది 99 రోజులేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ సర్కార్ రోజులు లెక్కబెట్టుకుంటోందన్నారు. 16, 17, 18 సెప్టెంబర్ 2023 దేశ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన రోజులు అన్నారు. భాగ్యనగరంలో ఈ మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీ కార్డులను ప్రజలకు చేరేవేసే కార్యక్రమాలు జరిగాయన్నారు. 

ఏడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయన్నారు. తెలంగాణ కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

హామీల అమలులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలు ప్రజలు పోల్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పథకాలపై బీఆర్ఎస్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పరిస్థితులను బట్టి విధానం ఉంటుందన్నారు. 

తమ పార్టీ హామీలతో బీఆర్ఎస్ కకావికలమవుతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ముసుగులు తొలగిపోయాయని విమర్శించారు. వీరంతా ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ చెప్పింది చేస్తుందని, గతంలోను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను, నెరవేర్చిన హామీలను పోల్చి చూడాలన్నారు. ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్లే రాష్ట్రాల అవసరాలను బట్టి తేడాలు ఉంటాయని, కానీ హరీశ్ రావు జాతీయస్థాయి నిర్ణయాలు అంటూ మొండి వాదన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాము ధరణిని వంద శాతం రద్దు చేస్తామన్నారు. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరణితోనే ప్రారంభిస్తామన్నారు.

  • Loading...

More Telugu News