Narendra Modi: పార్లమెంటులో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ
- పార్లమెంటు పాత భవనానికి వీడ్కోలు కార్యక్రమం
- ఉద్వేగభరితంగా ప్రసంగించిన ప్రధాని మోదీ
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని వెల్లడి
- రాష్ట్ర విభజన ఇరువర్గాలను సంతృప్తిపరచలేకపోయిందని వ్యాఖ్యలు
పార్లమెంటు పాత భవనానికి వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర విభజన ఏపీ, తెలంగాణ వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని అన్నారు. నాడు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆ మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా జరిగిందని వివరించారు. ఆ మూడు రాష్ట్రాల విభజన అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని, అన్ని చోట్లా సంబరాలు జరిగాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రం ఆ విధంగా జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.