Jogi Ramesh: లోకేశ్ ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు గురించి ఏం చెబుతాడు?: జోగి రమేశ్

Jogi Ramesh questions Nara Lokesh Delhi tour
  • మా అయ్య రూ.371 కోట్లు కొట్టేసి, జైల్లో ఉన్నాడని చెబుతాడా? అని ప్రశ్న
  • ఇప్పటి వరకు చంద్రబాబు చరిత్ర ఏపీకే తెలిసింది.. లోకేశ్ అందరికీ చెబుతున్నాడని ఎద్దేవా
  • పవన్ కల్యాణ్‌కు తన అవినీతి వాటాలో చంద్రబాబు ఎంత ఇచ్చారన్న జోగి రమేశ్
నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలకు, జాతీయ మీడియాకు ఏం చెబుతారు? అని వైసీపీ నేత, మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీకి వెళ్లి మా తండ్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్లు నొక్కేశాడని, హవాలా రూపంలో వాటిని తరలించి తాము కొట్టేశామని జాతీయ మీడియాకు చెబుతారా? అని నిలదీశారు. జీ20 సదస్సు కారణంగా ఇప్పటి వరకు మీ అయ్య చంద్రబాబు చరిత్ర ఏపీకి మాత్రమే  తెలిసిందని, ఇప్పుడు లోకేశ్ తనంతట తాను వెళ్లి ఆయన తండ్రి నిజస్వరూపాన్ని జాతీయ మీడియా ముందు చెబుతాడట? అని ఎద్దేవా చేశారు. సిగ్గు, శరం వదిలేశారా? అని నిప్పులు చెరిగారు.

ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లడం, ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక న్యాయవాదిని తీసుకురావడం చూస్తుంటే వీరు ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలుకు వెళ్లాడన్నారు. ఇప్పటి వరకు ఆయన స్టేలతో బతికాడని, చంద్రబాబు అవినీతి ప్రజలందరికీ తెలుసునన్నారు. జగన్‌తో యుద్ధమంటే ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలతో యుద్ధమే అన్నారు.

చంద్రబాబు తన అవినీతిలో పవన్ కల్యాణ్‌కు ఎంత వాటా ఇచ్చారో చెప్పాలన్నారు. పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని, కొత్తగా కలిసేదేమిటని ఎద్దేవా చేశారు. లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. వీరు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదన్నారు. వీరిది నీచసంస్కృతి అన్నారు. జగన్ ఒక వీరుడు, ధీరుడు... దమ్మున్న మొనగాడు.. ఆయనను చూసి కొంచెమైనా నేర్చుకోండి అన్నారు. ఈ రోజు యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని, మీ పతనం ఆరంభమైందని, అలాగే అంతం కూడా కాబోతుందన్నారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఎవరెవరు కలిసి వచ్చినా ఆ తర్వాత చంద్రబాబు జైల్లో, కృష్ణా, గోదావరి నదుల్లో కొట్టుకుపోతారన్నారు. పవన్ బీజేపీతో సంసారం చేస్తూ, టీడీపీతో కలిశారన్నారు. ఏపీ చిత్రపటాన్ని ప్రపంచంలో చూపిస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అవినీతిలో మాత్రం మన దేశాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు జగన్ పాలన ఆదర్శవంతంగా ఉందన్నారు.
Jogi Ramesh
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News