Asia Cup: ఆసియా కప్: నేడు జరగనున్న పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్స్ కు ఎవరు వెళ్తారంటే..!
- సూపర్-4లో ఈరోజు పాక్ - శ్రీలంక మధ్య మ్యాచ్
- రన్ రేట్ లో మెరుగైన స్థితిలో ఉన్న శ్రీలంక
- ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్న భారత్
ఆసియా కప్ లో మరో కీలకమైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈరోజు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గెలిచే జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఫైనల్స్ లో భారత్ తో తలపడే జట్టు ఏదనేది ఈ నాటి మ్యాచ్ లో తేలిపోనుంది.
ఒకవేళ వర్షం కారణంగా ఈ నాటి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడంతో... రన్ రేట్ లో భారీగా వెనుకబడి ఉంది. ఇండియా చేతిలో చివరి వరకు పోరాడి ఓడిన శ్రీలంక రన్ రేట్ లో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో, మ్యాచ్ రద్దయితే శ్రీలంక జట్టు ఫైనల్స్ కు వెళ్తుంది. ఫైనల్స్ లో భారత్, శ్రీలంకలు తలపడతాయి.
ఇప్పటి వరకు పాకిస్థాన్, శ్రీలంకలు 155 వన్డేల్లో తలపడగా... పాక్ 92 మ్యాచ్ లలో, శ్రీలంక 58 మ్యాచ్ లలో గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి.