KTR: రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. ఎన్నికల సమయంలో చూసుకోవచ్చు!: కేటీఆర్

KTR ground breaking ceremony for MONIN

  • తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేటీఆర్
  • పరిశ్రమల కోసం సింగిల్ విండో తీసుకు వచ్చినట్లు చెప్పిన మంత్రి
  • రూ.300 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న మోనిన్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో 40 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మోనిన్ పరిశ్రమకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సంస్ధ రూ.300 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని, కానీ వాటిని ఎన్నికల సమయంలో చూసుకోవచ్చునని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

తమ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకు వచ్చిందన్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారి వారి ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే సహకరించాలన్నారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారిందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.

  • Loading...

More Telugu News