Tamilnadu: పులిపై పగ తీర్చుకున్న రైతు!

Farmer kills tiger by poisoning after it kills his cow

  • తమిళనాడు నీలగిరి అడవుల్లో వెలుగు చూసిన ఘటన
  • తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు
  • అడవిలో పులి సగం తిని వదిలేసిన ఆవు కళేబరానికి క్రిమిసంహారకాల పూత
  • అది తిని రెండు పులుల మృతి 
  • అటవీ శాఖ అధికారులు నిందితుడిని ప్రశ్నించగా బయటపడ్డ కుట్ర

తమిళనాడులో రెండు పులుల మృతి వెనుక ఓ రైతు కుట్ర ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీశాఖ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నీలగిరి అడవుల్లో ఇటీవల రెండు పులులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. ఓ ప్రాంతంలో రెండు పులులు, ఓ ఆవు కళేబరాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆవు కళేబరాన్ని పులులు తిన్న వైనాన్ని కూడా గుర్తించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉండటంతో వాటి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించారు. 

ఈ క్రమంలో ఆ శాంపిళ్లలో క్రిమిసంహారకాలు ఉన్నట్టు బయటపడింది. దీంతో, వారు ఆవు యజమాని శేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే పులిపై ప్రతికారం తీర్చుకున్నట్టు అంగీకరించాడు. పది రోజుల క్రితం తన ఆవును ఓ పులి చంపినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలోనే పులి సగం తిని వదిలిన ఆవు కళేబరానికి పురుగుల మందు పూసి విషపూరితం చేయడంతో ఆ రెండు పులులు మరణించాయని చెప్పుకొచ్చాడు.

More Telugu News