TDP: చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు: అచ్చెన్నాయుడు

TDP Leaders meets AP Governor At Visakha port guest house

  • తనకూ సమాచారం ఇవ్వలేదని చెప్పారన్న టీడీపీ నేత
  • రాజకీయ కక్షతో అక్రమ కేసు బనాయించారని ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆ పార్టీ నేతలు సోమవారం ఉదయం గవర్నర్ ను కలిశారు. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో గంటా శ్రీనివాస రావు, గండి బాబ్జి, చిరంజీవిరావు, రామారావు, రాజబాబు తదితరులు విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆదివారం ఉదయమే గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నించగా.. గవర్నర్ అపాయింట్ మెంట్ ను రద్దు చేశారు. దీంతో టీడీపీ నేతలు సాయంత్రం మరోమారు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా.. సోమవారం ఉదయం అపాయింట్ మెంట్ ఇచ్చారు.

గవర్నర్ ను కలిసి బయటకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని గవర్నర్ చెప్పారన్నారు. రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు వివరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఓ శాడిస్ట్, సైకో కూడా ఇలాంటి దుర్మార్గపు అరెస్టుకు ఆదేశించరని చెప్పారు. యువనేత లోకేశ్ పాదయాత్రను ప్రజలు విశేషంగా ఆదరించడం చూసి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నేతలకు అర్థమైందన్నారు. ఐ ప్యాక్ టీమ్ జరిపిన సర్వేలో అధికార పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీ చిరునామా గల్లంతేనని తేలిందని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News